ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » టీం ఇండియాను చిత్తుగా ఓడించిన గ్రేమ్ స్మిత్ సేన! (India | South Africa | Win | Greame Smith | Sachin | Sehwag | Harris | Steyn)
మహేంద్ర సింగ్ ధోనీసేనను సఫారీలు చిత్తుగా ఓడించారు. టీం ఇండియాను ఒత్తిడిలోకి నెట్టి తప్పకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ చెప్పిన మాటను తొలి టెస్టులోనే నిలబెట్టుకున్నాడు.
ఫలితంగా భారత్-దక్షిణాఫ్రికాల మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులోనే ఒక ఇన్నింగ్స్ ఆరు పరుగులతో భారత్‌ను.. దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడించింది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 పాయింట్ల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 558/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్‌తో రెండో ఇన్నింగ్స్‌ను ఆడిన భారత్, బ్యాట్స్‌మెన్ల పేలవమైన ఆటతీరుతో 233 స్వల్ప పరుగులకే ఆలౌటైంది.
ఫాలో ఆన్ ఆడిన భారత్ నాలుగో రోజు ఆటలో సీనియర్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే నిలకడగా ఆడి, జట్టుకు ఆ మాత్రం స్కోరునైనా సాధించిపెట్టాడు. 179 బంతుల్లో 13 బౌండరీలతో 100 పరుగులు చేసి, తన అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్‌లో 46వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు సరిగ్గా వంద పరుగులు చేసి, హారిస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్నాడు.
ఇక ఓపెనర్‌గా బరిలోకి దిగిన గౌతం గంభీర్ (1), తొలి రెండు ఇన్నింగ్స్‌లలో ధీటుగా రాణించలేకపోయాడు. అలాగే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులకే స్టెయిన్ బౌలింగ్‌తో వెనుదిరిగాడు.
ఇదే తరహాలో దక్షిణాఫ్రికా బౌలర్ల అద్భుత బౌలింగ్‌తో బద్రీనాథ్ (6), మహేంద్ర సింగ్ ధోనీ (25), సహా (36), భజ్జీ (39), జహీర్ ఖాన్ (33), అమిత్ మిశ్రా (0), ఇషాంత్ శర్మ (0)లు వెంట వెంటనే పెవిలియన్ వైపు క్యూ కట్టారు. దీంతో ఒక ఇన్నింగ్స్ ఆరుపరుగుల తేడాతో దక్షిణాఫ్రికా భారత్‌పై ఘన విజయం సాధించింది.
ఇకపోతే దక్షిణాఫ్రికా బౌలర్లలో తొలి ఇన్నింగ్స్‌లో విజృంభించిన స్టెయిన్, రెండో ఇన్నింగ్స్‌లోనూ తన సత్తా చాటాడు. దీంతో తొలి టెస్టులో స్టెయిన్ మొత్తం పది వికెట్లు తీశాడు. ఇలాగే హారిస్ చెరో మూడు, పార్నెల్ రెండు, మోర్కెల్, కల్లీస్‌లు చెరో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇకపోతే.. రెండో టెస్టు ఈ నెల 14వ తేదీన కోల్‌కతా ప్రారంభం కానుంది.
సంక్షిప్త స్కోరు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 558/6 భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 233 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 319 ఆలౌట్.