భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను దేశ అత్యున్నత పురస్కారమైన "భారత రత్న"తో సత్కరించాలని రాజ్యసభ ఏకగ్రీవంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్సీపీకి చెందిన సభ్యుడు కేంద్రాన్ని కోరారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న మాస్టర్‌కు భారత రత్న అవార్డును అందజేయాలని రాజ్యసభ ప్రభుత్వాన్ని కోరింది.
దక్షిణాఫ్రికాతో గ్వాలియర్‌లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించి, ప్రపంచ రికార్డును సృష్టించిన సచిన్, యువ క్రికెటర్లకు మార్గదర్శకంగా, స్ఫూర్తిగా నిలిచాడని రాజ్యసభ అభినందించింది. అందుచేత సచిన్ టెండూల్కర్‌కు భారత రత్న పురస్కారాన్ని అందించాల్సిందిగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రంజిత్‌సిన్ విజయ్‌సిన్ మొహితే-పాటిల్ కోరారు.
క్రికెట్ చరిత్రలో ధీటుగా రాణిస్తూ, జాతికి గౌరవం సంపాందించిపెట్టే సచిన్‌ను ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరించాల్సిన అవసరం ఉందని మొహితే పేర్కొన్నారు. తన 16వ ఏటనే కరాచీలో క్రికెట్ ఆడిన సచిన్, ఇప్పటివరకు ఏ సందర్భంలోనైనా నిరుత్సాహానికి లోనుకాలేదని మొహితే అన్నారు.
సచిన్ ఆటోగ్రాఫ్ ఐపీఎల్ టిక్కెట్ ధర రూ.11లక్షలు
బ్యాటింగ్ మేస్ట్రో సచిన్ టెండూల్కర్ ఆటోగ్రాఫ్ చేసిన బిగ్‌స్క్రీన్ ఐపీఎల్ టికెట్ రూ.11 లక్షలు పలికింది. బిగ్ స్క్రీన్ ఐపీఎల్ టికెట్ వేలం పాట ముంబైలో జరిగింది. ఈ వేలంలో టిక్కెట్ కనీస ధర రూ.5 లక్షలుగా ప్రకటించబడింది. దీంతో ప్రారంభమైన ఈ వేలం పాట ద్వారా లభించిన నగదును అప్నాలయా అనే సేవా ట్రస్టుకు చేరుతుంది.
ఐపీఎల్ మ్యాచ్‌లను సినిమా థియేటర్లో వీక్షించేందుకు వీలుగా తొలి టెకెట్‌ను సచిన్ టెండూల్కర్ బుధవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అప్నాలయాతో తనకు గల సంబంధం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమాజంలో బడుగు వర్గాలకు చెందిన చిన్నారుల ప్రతిభను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పిస్తుందని సచిన్ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాతో జరిగిన గ్వాలియర్ వన్డేలో డబుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డు సృష్టించిన సచిన్ టెండూల్కర్‌కు అభిమానులు 200 బ్యాట్‌లను కానుకగా అందజేశారు. వడోదరాలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిమానులు అందజేసిన బ్యాట్‌లపై సచిన్ సంతకాలు చేశాడు. తాను సంతకాలు చేసిన 200 బ్యాట్‌లను యువ క్రికెటర్లకు కానుకగా అందజేయాలని సచిన్ అభిమానులు కోరారు.