ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » డబ్బు తీసుకున్న మాట నిజమే కానీ..!: పాక్ క్రికెటర్లు (Spot Fixing | Money | Cricketers | Salman Butt | Mohammad Asif | Amir)
డబ్బు తీసుకున్న మాట నిజమే కానీ..!: పాక్ క్రికెటర్లు
PTI
'స్పాట్ ఫిక్సింగ్' వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ భట్, మొహమ్మద్ ఆసిఫ్, మొహమ్మద్ అమీర్‌లు బుకీ మజీద్ వద్ద డబ్బు తీసుకున్న మాట నిజమేనని స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని జియో టీవీ ప్రసారం చేస్తోంది.
మజీద్ వద్ద డబ్బు తీసుకున్న మాట నిజమేనని కానీ.. ఆ డబ్బు వాణిజ్య ప్రకటనల కోసం సంబంధిత సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా వచ్చిందని పాక్ క్రికెటర్లు పోలీసులు వద్ద వెల్లడించినట్లు ఆ టీవీ తెలిపింది. వాణిజ్య ప్రకటనలను మాకు ఖరారు చేసే ఓ స్నేహితుడిగానే మజీద్‌ను భావించాం. అయితే మజీద్ బుకీ అన్న విషయం మాకు తెలియదని పాక్ క్రికెటర్లు పోలీసుల వద్ద తెలిపినట్లు ఆ టీవీ పేర్కొంది.
'స్పాట్ ఫిక్సింగ్' వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ త్రయం భట్, ఆసిఫ్, అమీర్‌లు.. మజీద్ వద్ద డబ్బు తీసుకున్న మాటను పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు తన వద్ద చెప్పారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) న్యాయవాది రిజ్వి స్వయంగా చెప్పినట్లు జియో టీవీ ప్రచురించింది.
ఈ విషయమై రిజ్వి ఇంకా మాట్లాడుతూ.. మజీద్ వద్ద నో-బాల్ వేసేందుకు పాక్ క్రికెటర్లు డబ్బు తీసుకోలేదని, వాణిజ్య ప్రకటనల కోసమేనన్నారు. ఈ విషయాన్ని పాక్ క్రికెటర్లు స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు రిజ్వీ వెల్లడించారు.
దీంతో పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టినట్లు ఆయన తెలిపారు. ఇంకా పీసీబీ ప్రమేయం లేకుండా క్రికెటర్లు వారికి నచ్చిన వాణిజ్య ప్రకటన కోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలుందని రిజ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.