కొలంబో ఎస్ఎస్‌సీ గ్రౌండులో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ మహేళ జయవర్ధనే సెంచరీ సాధించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. మ్యాచ్ రెండో రోజు టీ విరామ సమయానికి శ్రీలంక జట్టు 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. క్రీజ్‌లో జయవర్ధనే (105), సమరవీర (51)లు ఉన్నారు.
శ్రీలంక జట్టు బ్యాట్స్‌మెన్లు రెండో రోజు ఆటపై పట్టు సాధించారు. కెప్టెన్ జయవర్ధనే-సమరవీరలు నాలుగో వికెట్‌కు అబేధ్యంగా 93 పరుగులు జోడించారు. జయవర్ధనే 8 ఫోర్లు, సిక్స్‌తో 105 పరుగులుచేసి కెరీర్‌లో 23వ సెంచరీ నమోదుచేశాడు. భారత్‌పై ఇది 4వ కాగా, ఎస్ఎస్‌సీ గ్రౌండులో తొమ్మిదవది కావటం విశేషం.
జయవర్ధనే, బ్రాడ్‌మన్‌లు ఒకే వేదికపై 9సార్లు సెంచరీలు చేయడం గమనార్హం. మెల్‌బోర్న్ వేదికగా వివిధ జట్లపై బ్రాడ్‌మన్ 9 సెంచరీలు చేయగా, మహేళ జయవర్ధనే కొలంబో ఎస్ఎస్‌సీ గ్రౌండులో ఈ ఫీట్ చేశాడు. ఆస్ట్రేలియా ఓపెనర్, బ్యాటింగ్ ధిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ సాధించిన రికార్డును జయవర్ధనే ఎస్ఎస్‌సీలో సమానం చేశాడు.
ఓపెనర్ వర్ణపురా 14 ఫోర్లతో 115 పరుగులుచేసి హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. జయవర్ధనే-వర్ణపురాలు మూడో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. వర్ణపురా కెరీర్‌లో రెండో సెంచరీ చేశాడు. భారత బౌలర్లు ఇషాంత్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లు తలా వికెట్ పడగొట్టారు.
|