లాస్ ఏంజిల్స్ వేదికగా జరుగుతున్న ఈస్ట్ వెస్ట్ బ్యాంక్ క్లాసిక్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా-బెథానీ మాటెక్ జోడీ క్వార్టర్ ఫైన్లలోకి అడుగుపెట్టింది. భారత-అమెరికా జోడీ 6-3, 6-4 సెట్ల తేడాతో యూఎస్-రష్యా ద్వయంపై జయభేరి మోగించింది. రెండో సీడ్ తారలైన సానియా-మాటెక్‌లు మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్ధికి సవాలు విసిరారు.
తొలి సెట్‌లో వానియా కింగ్-అల్లా కుద్రయేత్సవాలపై 6-3 తేడాతో సానియా జోడి విజయం సాధించింది. మలి సెట్‌లో యూఎస్-రష్యాజోడీ కాస్తంత పోటీనిచ్చినప్పటికీ దానిని అధిగమించి సానియా-మాటెక్‌లు 6-4 తేడాతో గెలుపు సాధించి టోర్నీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.
టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రష్యా ద్వయం ఎలీనా వెర్సీనా- వెరా జొనరేవాలతో సానియా మీర్జా జోడీ తలపడుతుంది. సానియా సింగిల్స్ విభాగం తొలి రౌండు మ్యాచ్‌లో ఎవా హర్‌దినోవాపై జయభేరి మోగించి తదుపరి రౌండులోకి అడుగుపెట్టింది. సానియా మీర్జా రెండో రౌండు మ్యాచ్‌లో చైనాకు చెందిన మెంగ్ యువాన్‌తో తలపడుతుంది.
|