కొచ్చిలో జరుగుతోన్న 48వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ పోటీల్లో హర్విందర్ సింగ్‌కు స్వర్ణ పతకం లభించింది. బుధవారం జరిగిన 20000 మీటర్ల నడక పోటీలో ప్రధమ స్థానాన్ని సాధించడం ద్వారా హర్విందర్ ఈ ఘనత సాధించాడు.
ఆర్మీ జట్టు క్రీడాకారుడైన హర్విందర్ గంటా 35 నిమిషాల 21 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా హర్విందర్ స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ పరుగు పోటీ జరుగుతున్న సమయంలో రైల్వే జట్టు క్రీడాకారుడైన అశోక్ కుమార్ పటేల్ ప్రధమ స్థానాన్ని సాధించే సూచనలు కన్పించాయి.
కానీ చివరి మూడు వందల మీటర్ల వద్ద తన వేగాన్ని పెంచిన హర్విందర్ అనూహ్యంగా అశోక్ కుమార్‌ను అధిగమించి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. పోటీ అనంతరం హర్విందర్ మాట్లాడుతూ స్వర్ణం గెలిచే విషయంలో తాను ప్రారంభం నుంచి నమ్మకంతోనే ఉన్నానని అన్నాడు. ప్రస్తుత విజయంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని అతను పేర్కొన్నాడు.
ఈ విభాగంలో రజత పతకాన్ని సాధించిన అశోక్ కుమార్ పటేల్ గంటా 35నిమిషాల 32 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. అలాగే ఈ విభాగంలో గంటా 36 నిమిషాల 11 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా జలాన్ కాంస్య పతకాన్ని సాధించాడు.
|