మూడో కామన్వెల్త్ యూత్ క్రీడల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. డబుల్ ట్రాప్ షూటర్ ఆషర్ నోరియా వంటి ఆటగాళ్లు ఈ క్రీడల్లో ముత్యాల్లా మెరవడంతో భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. పూనేలో జరుగుతున్న ఈ క్రీడల్లో భాగంగా నాలుగో రోజున షూటింగ్, రెజ్లింగ్ పోటీలు జరిగాయి.
బుధవారం జరిగిన ఈ పోటీల అనంతరం భారత్ ఖాతాలో 11 స్వర్ణ, పది రజత, ఏడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 35 పతకాలు చేరాయి. దీంతో భారత్ మొదటి స్థానాన్ని అలంకరించింది. ఇక స్విమ్మింగ్ విభాగంలో బలమైన పోటీనిచ్చిన ఆస్ట్రేలియా 11 స్వర్ణ, ఐదు రజత, తొమ్మిది కాంస్య పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.
ఇంగ్లాండు ఒక స్థానం దిగజారి.. తొమ్మిది స్వర్ణ, ఐదు రజత, నాలుగు కాంస్య పతకాలతో మూడో స్థానానికి పడిపోయింది. ఇక కెనడా రెండు స్వర్ణ, ఏడు రజత, నాలుగు కాంస్య పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. |