వచ్చే ఏడాదిలో జరిగే కామన్వెల్త్ క్రీడలను షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే నిర్వహించాలని లండన్ 2012 ఒలింపిక్ క్రీడల నిర్వాహక కమిటీ ఛైర్మన్ సెబాస్టియన్ కోయ్ అభిప్రాయపడ్డారు. భద్రతపరమైన సవాళ్లను ఎదుర్కొని భారత్‌లోనే ఈ క్రీడలు నిర్వహించాలని ఆయన సూచించారు.
లండన్‌లో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెబాస్టియన్ మాట్లాడుతూ, అనేక ప్రతిష్టాత్మక టోర్నీలున్నాయి. ఇది ప్రపంచం.. ఈ ప్రపంచంలో పెద్ద టోర్నీలన్నీ జరుగుతూనే ఉండాలని వివరించారు. కామన్వెల్త్‌కు భద్రత సమస్యలు తలెత్తవచ్చని వార్తలు వస్తున్నప్పటికీ.. ఇలాంటి విషయాలన్నీ ఓ సవాలుగా తీసుకుని భారత్ ఈ టోర్నీని నిర్వహించాలని తెలిపారు.
ఇటువంటి ప్రధాన టోర్నీలు ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేందుకు ఇతర దేశాల ప్రధాన క్రీడా సమాఖ్యలు భారత్ వంటి దేశాలకు సహాయసహకారాలు అందించాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలపై పూర్తి స్థాయి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని.. కనుక ఐపీఎల్-2కు అదనపు భద్రత కల్పించలేమని భారత ప్రభత్వం స్పష్టం చేసింది.
దీంతో ఈ టోర్నీని భారత్‌లో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన నేపథ్యంలో కామన్వెల్త్ క్రీడల నిర్వహణపై సెబాస్టియన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. |