50వ ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీకి వెళ్లే భారత్ జట్టులో ఒలింపిక్ పాడ్లర్ అంచటా శరత్ కమల్, కొత్త మహిళా జాతీయ ఛాంపియన్ కుమరేశన్ షామినీలు చోటు సంపాదించారు ఈ టోర్నీ కోసం మొత్తం 10 మంది భారతీయుల బృందం జపాన్‌కు వెళుతోంది.
ఏప్రిల్ 28 నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నీ జపాన్‌లోని యొకోహమాలో జరుగనుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం 10 మంది భారతీయ పాడ్లర్లు సహా మాజీ జాతీయ ఛాంపియన్‌లయిన సుభాజిత్ సాహా, పౌలోమీ ఘాతక్, మౌమా దాస్‌లతో పాటు జపాన్ పాడ్లర్లు కూడా ప్రస్తుతం హెబీలోని ఝెంగ్‌డింగ్ వద్ద ఉన్న నేషనల్ టేబుల్ టెన్నిస్ కేంద్రంలో 25 రోజుల ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంటున్నారు.
ఈ ట్రైనింగ్ సెషన్‌కు వచ్చిన 18 మంది సభ్యులు గల భారత బృందంలో కొత్త జాతీయ కోచ్ ఇటాలియన్ మాస్సిమో కాన్‌స్టాంటినీ మరియు భవానీ ముఖర్జీ, చీఫ్ టేబుల్ టెన్నిస్ కోచ్ ఎన్ఐఎస్ పాటియాలాలు ఉన్నారు. అదలా ఉంచితే.. జపాన్‌లో జరిగే ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో శరత్ యధావిధిగా పాల్గొంటుండగా.. డబుల్స్ విభాగంలో సుభాజిత్‌తో కలిసి బరిలోకి దిగనున్నాడు.
ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత నెంబర్ వన్ జోడీ అయిన పౌలోమీ మరియు మౌమాలు పాల్గొంటారు. టోర్నీకి వెళ్లే జట్టు: అచంటా శరత్ కమల్, సుభాజిత్ సాహా, ఎ అమల్రాజ్, సౌరవ్ చక్రవర్తి, పాట్థిక్ మెహతా, పౌలోమీ ఘతక్, మౌమా దాస్, కుమరేశన్ షామినీ, మధురికా పాట్కర్, కస్తూరి చక్రవర్తి. కోచ్‌లు: మాస్సిమో కాన్‌స్టాంటినీ, భవానీ ముఖర్జీ. మేనేజర్లు: పురుషుల విభాగానికి ఆర్ ఎస్ జడేజా, మహిళల విభాగానికి టి దువారహ్ |