మాడ్రిడ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన నెంబర్ వన్ ఆటగాడు రఫెల్ నాదల్‌పై స్విట్జర్లాండుకు చెందిన నెంబర్ టూ ఆటగాడు రోజర్ ఫెదరర్ గెలుపొందాడు. ఇటీవల జరిగిన టోర్నీల్లో ఫెదరర్‌పై వరుస విజయాలను నమోదు చేసిన మట్టి కోర్టుల రారాజు నాదల్ మాడ్రిడ్ ఫైనల్లో మాత్రం అనూహ్య ఓటమి చవిచూశాడు.హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్ పోరులో నాదల్‌పై 6-4, 6-4తో ఫెదరర్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. రెండు ఏస్‌లతో కదం తొక్కిన ఫెదరర్.. ఈ స్పెయిన్ ఆటగాడిపై సరికొత్త ఫైనల్స్ రికార్డ్‌ను నమోదు చేశాడు. మరో వారంలో ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభమవనుంది. ఈ నేఫథ్యంలో ఫెదరర్... మాడ్రిడ్ టైటిల్‌ను గెలుచుకుని సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగిడనున్నాడు.గత ఏడాది వేసవిలో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో నాదల్ చేతిలో ఫెదరర్ కంగుతిన్న విషయం తెలిసిందే. అదలా ఉంచితే మాడ్రిడ్ టైటిల్ గెలుచుకున్న అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ, ఈ విజయం తనకెంతో సంతృప్తినిచ్చిందన్నాడు. మట్టి కోర్టులపై నాదల్ అద్భుత ఆటతీరును కనబరుస్తున్నాడని 13 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న ఫెదరర్ ప్రశంసించాడు. కాగా, ఇప్పటి వరకు నాదల్ ఈ ఏడాది సీజన్‌లో మోంటే కార్లో, బార్సిలోనా, రోమ్ తదితర క్లే కోర్టు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. |