కొత్తగా అవతరించిన హాకీ ఇండియా (హెచ్ఐ) ఏర్పాటులో రాష్ట్ర హాకీ అసోసియేషన్‌లే ప్రధాన వాటాదారులని మాజీ ఐహెచ్ఎఫ్ చీఫ్ కేపీఎస్ గిల్ వెల్లడించారు. హెచ్ఐ, భారత హాకీ సమాఖ్య (ఐహెచ్ఎఫ్)ల మధ్య విభేదాలకు ముగింపు పలకడానికి తన వంతు సాయం చేస్తానని గిల్ హామీ ఇచ్చారు.
హెచ్ఐతోపాటు రాష్ట్ర హాకీ సమాఖ్యను న్యూఢిల్లీలో సమావేశానికి ఆహ్వానించిన సందర్భంగా గిల్ విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాది ప్రపంచ కప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు జరుగనుండటంతో సమయాన్ని వృథా చేయరాదని ఆయన హితవు పలికారు. భారత హాకీకి పూర్వవైభవం తీసుకురావాలని తెలిపారు.
భారత హాకీని అభివృద్ధి చేయడంలో తాము ఈర్ష్య, అహంకారాలకు అతీతంగా నిలుస్తామన్నారు. హాకీ క్రీడను మరింతగా వృద్ధి చేయడం కోసం తాము ఎవరితో పనిచేసేందుకైనా హృదయ పూర్వకంగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా, మలేషియా/సింగపూర్‌లో జరిగిన జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో మెడల్ రౌండు కోసం జరిగిన క్వాలిఫైపోటీల్లో భారత జాతీయ జట్టు విఫలం కావడం తమనెంతో నిరుత్సాహానికి గురిచేసిందని గిల్ అన్నారు.
1997లో రన్నరప్‌గా, 2001లో విజేతగా.. 2005లో నాలుగో ర్యాంకర్‌గా నిలిచిన భారత్ ప్రస్తుతం తొమ్మిది స్థానంలో ఉందన్నారు. ఇటీవల కాలంలో జరిగిన ప్రపంచకప్‌లో సీనియర్ హాకీ జట్టు తాజాగా జూనియర్ హాకీ జట్లు పేలవ ప్రదర్శనతో విఫలం చెందాయని గుర్తు చేశారు. అందుకే ప్రస్తుతం హాకీ క్రీడను తిరిగి గాడిలో పడేయాల్సిన అవసరం ఉందన్నారు. |