2009 చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను తిరిగి తాను నిలబెట్టుకుంటానని ప్రపంచ నెంబర్ వన్ చెస్ ఆటగాడు విశ్వనాథ్ ఆనంద్ ధీమా వ్యక్తం చేశాడు. బలమైన ప్రత్యర్థి అయిన బల్గేరియాకు గ్రాండ్ మాస్టర్ వాస్‌లీన్ తపలోవ్‌పై కూడా అధిపత్యం వహించగలనని విశ్వాసం వ్యక్తం చేశాడు.న్యూఢిల్లీలో విలేకరులతో ఆనంద్ మాట్లాడుతూ, ఈ ప్రపంచకప్ టోర్నీలో తనకు బలమైన ప్రత్యర్థి తపలోవ్ అని.. అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. రాను రాను తపలోవ్ మరింతగా రాటుదేలుతున్నాడని వివరించాడు. రాపిడ్ చెస్ గేమ్‌లో తపలోవ్ వేగంగా పావులు కదపగల సామర్థ్యం కలగిన వాడని తెలిపాడు.అయితే ఇటీవల ఈ రాపిడ్ చెస్ ఫార్మాట్‌లో తాను విజయం సాధించడాన్ని ఆనంద్ గుర్తు చేశాడు. తాను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లయితే.. సౌకర్యవంతంగా రాపిడ్ చెస్ గేమ్ ఆడగలనన్నాడు. ఏదేమైనప్పటికీ.. తాను ప్రపంచకప్ కోసం ప్రాక్టీసు చేస్తున్నట్లు వ్యాఖ్యానించాడు.అదలా ఉంచితే.. ఇటీవల హంగేరీలో జరిగిన రాపిడ్ చెస్ టోర్నీలో అదేశానికి చెందిన నెంబర్ వన్ పీటర్ లీకోపై ఆనంద్ విజయం సాధించాడు. కాగా, 40 ఏళ్ల ఆనంద్ తన కెరీర్ ప్రస్థానంలో ఇప్పటి వరకు ఆరు చెస్ ఆస్కార్ అవార్డులను గెలుపొందాడు. |