వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఓ రసవత్తర ఘట్టానికి తెరలేవనుంది. ఇద్దరు టాప్ ర్యాంక్ క్రీడాకారిణిలు ఈ టోర్నీ సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. నెంబర్ వన్ ర్యాంక్ హోదాలో రష్యా భామ దినారా సఫీనా బరిలోకి దిగుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా, ఐదు సార్లు వింబుల్డన్ టైటిల్ విజేతగా అమెరికా టాప్ ర్యాంక్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ ధీమాగా మరో టైటిల్ నెగ్గేందుకు అడుగిడుతోంది.
అంతకుముందు ఈ టోర్నీ క్వార్టర్స్‌లో పోలెండ్‌కు చెందిన ఆగ్నియెస్కా రద్వాన్‌స్కాపై 6-1, 6-2తో వీనస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. అలాగే మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన అన్‌సీడెడ్ టీనేజర్ సబైన్ లిసికీపై 6-7 (5/7), 6-4, 6-1తో సఫీనా గెలుపొందింది. తద్వారా సెమీస్ చేరుకుంది. ఇప్పటికి పదిసార్లు వీనస్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొంటూ వస్తోంది.
గతంలో వింబుల్డన్ టైటిళ్లను 1991-93ల మధ్య మూడు సార్లు నెగ్గిన స్టెఫీగ్రాఫ్ హ్యాట్రిక్ రికార్డ్‌ను బ్రేక్ చేసే దిశగా వీనస్ ముందడుగు వేస్తోంది. ఇప్పటి వరకు ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో 32 సెట్లు ఆడింది. 2007లో మూడో రౌండు నుండే వైదొలిగింది. అదలా ఉంచితే.. ఇప్పటికే వింబుల్డన్‌లో అపార అనుభవంతో వీనస్ బరిలోకి దిగుతుండగా.. తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ కోసం సఫీనా పోరాడుతోంది. |