ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ అంతిమ పోరులో అభిమానులు ఎదురుచూసినట్లే విలియమ్స్ సిస్టర్స్ తలపడనున్నారు. దీంతో అక్కాచెల్లెళ్ల మధ్యే అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రత్యర్థులను హడలెత్తింపజేసే విలియమ్ సిస్టర్స్ సెమీఫైనల్లో గట్టిపోటీని ప్రదర్శించి విజేతగా నిలిచారు. దీంతో ఫైనల్లో విలియమ్స్ సిస్టర్స్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడతారు. దీంతో ఈ ఏడాదీ వింబుల్డన్ టైటిల్ విలియమ్స్ ఇంటికే వెళ్లనుంది. అమెరికన్ సంచలన టెన్నిస్ స్టార్స్ విలియమ్ సిస్టర్స్ రష్యన్ ప్రత్యర్థుల్ని ఖంగు తినిపించారు. తొలి సెమీఫైనల్లో చెల్లెలు సెరెనా, నాలుగో సీడ్ దెమెంతివాను 6-7, 7-5, 8-6 తేడాతో మట్టికరిపించగా, తర్వాతి సెమీస్‌లో అక్క వీనస్ విలియమ్స్ ధీటుగా రాణించింది. నెంబర్‌వన్ సఫీనాను 6-1, 6-0 వరుస సెట్లతో చిత్తుగా ఓడించి విజయభేరి మోగించింది. ఇంతవరకు ఎన్నడూ ఆడని రీతిలో సఫీనా పేలవమైన ఆటతీరును ప్రదర్శించింది. విలియమ్స్ షాట్లను ధీటుగా ఎదుర్కోలేక పోయింది. దీంతో సఫీనా రెండు సెట్లలో ఒకే ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఇకపోతే.. డిఫెండింగ్ ఛాంపియన్ వీనస్‌తో గత ఏడాది రన్నరప్ సెరెనా ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. |