మాజీ ప్రపంచ నెంబర్ వన్, స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ శుక్రవారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో టామీ హాస్‌తో బరిలోకి దిగనున్నాడు.లండన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ సెమీఫైనల్ పోరులో భాగంగా అత్యధిక సింగిల్స్ గ్రాండ్ స్వామ్ విజయాల్లో సంప్రాస్ రికార్డు సొంతం చేసుకున్న ఫెదరర్, 24వ సీడెడ్ టామీ హాస్ (జర్మనీ)తో తలపడతాడు. ఈ సెమీస్‌లో ఫెదరర్ గెలిస్తే 20వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరి ఇవాన్ లెండిల్ రికార్డును అధిగమిస్తాడు. వింబుల్డన్‌లో ఐదుసార్లు నెగ్గిన చరిత్ర గల ఫెదరర్, క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ ఇవో కార్లోవిచ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే.మరోవైపు సెమీఫైనల్లో టామీ హాస్‌పై ఫెదరర్ సునాయాసంగా నెగ్గుతాడని, తప్పకుండా 2009 వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకుంటాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే.. శుక్రవారం జరిగే మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే, ఆండీ రాడిక్ (అమెరికా)తో తలపడనున్నాడు. సెమీఫైనల్లో ముర్రే గెలిచినట్లైతే ఫైనల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫెదరర్‌తో బరిలోకి దిగుతాడు. |