పూనేలోని శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద యూరప్‌లోని నాలుగుదేశాల్లో పర్యటన కోసం వెళ్లే భారత హాకీ సీనియర్ జట్టును ఎంపిక చేయనున్నారు. జూన్ 15 నుండి హాకీ కోచ్ జోస్ బ్రాసా నేతృత్వంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న వారిని ప్రాబబుల్స్ జాబితాలోకి ఎంపిక చేసుకుంటామని కొత్తగా ఏర్పాటైన హాకీ ఇండియా కార్యదర్శి, సెలెక్షన్ కమిటీ కన్వీనర్ సర్దార్ మొహమ్మద్ అస్లామ్ ఖాన్ వెల్లడించారు.పూనేలో విలేకరులతో అస్లామా ఖాన్ మాట్లాడుతూ, ఈ రోజు సాయంత్రం జట్టును ఖరారు చేస్తామన్నారు. ఖరారైన జట్టు ఇంగ్లాండ్, బెల్జియం, స్పెయిన్ మరియు హాలెండ్‌లలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఖరారైన జట్టుతో పాటు మరికొంత మంది అదనపు ఆటగాళ్లను కూడా ఈ పర్యటనకు పంపుతున్నట్లు ఖాన్ వివరించారు. 2010 న్యూఢిల్లీ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడల కోసం జట్టును సిద్ధం చేయడంలో భాగంగా అదనపు ఆటగాళ్లను కూడా పంపుతున్నట్లు వ్యాఖ్యానించారు. అదలా ఉంచితే... పూనేలో జరుగిన శిక్షణ క్యాంప్‌లో కొంత మంది జూనియర్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. వీరు ఇటీవల జరిగిన జూనియర్ ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉన్నారు. సింగపూర్/మలేషియాలలో జరుగనున్న జూనియర్ ప్రపంచకప్ కోసం శిక్షణ క్యాంప్‌కు ఈ ఆటగాళ్లను పిలిపించారు. మరోవైపు హాకీ ఆటగాళ్ల కోసం ఒక వైద్యుని అవసరం తప్పనిసరి అని కోచ్ బ్రాసా ప్రతిపాదించారు. బ్రాసా ప్రతిపాదన మేరకు త్వరలోనే హాకీ ఆటగాళ్లకు ఒక ప్రత్యేక వైద్యుడిని ఎంపిక చేస్తామని.. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని ఖాన్ తెలిపారు. |