వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీల కోసం వెళ్లే భారత జట్టుకు ప్రపంచ నెంబర్ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి అయిన సైనా నెహ్వాల్ సారథ్యం వహించనుంది. ఇటీవల కాలంలో వివిధ టోర్నీల్లో జైత్రయాత్ర సాగిస్తూ వస్తున్న సైనా.. తొలిసారిగా సారథ్య బాధ్యతలు స్వీకరించనుండటం విశేషం.ఇటీవలే సైనా ఇండోనేషియా సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఆగస్ట్ 10 నుండి 16వ తేదీ వరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరుగనుంది. ఈ టోర్నీలో సైనాతో పాటు ప్రధాన భారత షట్లర్లు రాణించే అవకాశం ఉందని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య భావిస్తోంది.కాగా, మహిళల జట్టుకు సైనా సారథ్యం వహిస్తుండగా.. పురుషుల జట్టుకు అనూప్ శ్రీధర్ లీడ్ చేయనున్నాడు. గత ఏడాది గాయాలతో సతమతమయిన శ్రీధర్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడి ప్రస్తుతం 14వ స్థానంలో ఉన్నాడు. |