జైపూర్‌లో జూలై 22 నుండి 26వ తేదీ వరకు 15వ ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో సుమారు 13 జట్లు పాల్గొంటున్నట్లు భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) జనరల్ కార్యదర్శి మూల్‌చంద్ చౌహాన్ వెల్లడించారు.
జైపూర్‌లో విలేకరుల సమావేశంలో మూల్‌చంద్ మాట్లాడుతూ, సవాయ్ మాన్ సింగ్ వద్ద ఈ టోర్నీని నిర్వహించనున్నట్లు తెలిపారు. బలమైన జట్లు రంగంలోకి దిగనున్నాయన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ చైనా, గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన డీపీఆర్ కొరియా, జపాన్, కజకిస్థాన్, సింగపూర్, కొరియా రిపబ్లిక్, థాయ్‌లాండ్, ఇరాన్, బహ్రెయిన్, చైనీస్ తైపీ మరియు హాంకాంగ్‌లు పాల్గొంటున్నట్లు వివరించారు.
అండర్ - 18లో కాడెట్ బాలుర మరియు బాలికల (జూనియర్) విభాగాల్లో మొత్తం నాలుగు కేటగిరీల్లో ఈ టోర్నీ నిర్వహిస్తామన్నారు. సింగిల్స్ మరియు జూనియర్ బాలుర మరియు బాలికల డబుల్స్ ఈవెంట్‌లు కూడా జరుగుతాయన్నారు. టీం ఈవెంట్ మాత్రం లీగ్-కమ్-నాకౌట్ ఆధారంగా జరుగుతుందన్నారు.
డిసెంబర్‌లో కొలింబియాలో జరిగే ప్రపంచ జూనియర్ ఛాంపియన్‌షిప్ కోసం ఒక్కో కేటగిరీ నుండి నాలుగు జట్లు క్వాలిఫై అవుతాయన్నారు. |