రోమ్‌లో జరుగుతున్న స్విమ్మింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టోర్నీలో ఒకే రోజు ఐదు ప్రపంచ రికార్డ్‌లు బద్దలయ్యాయి. పురుషుల 400మీటర్ల ఫ్రీస్టైల్ విభాగపు టైటిల్‌ను జర్మనీ స్విమ్మర్ పాల్ బీడర్మన్ కైవసం చేసుకున్నాడు. అలాగే మహిళల 400 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగపు టైటిల్‌ను ఇటలీకి చెందిన ఫెడరికా పెల్లిగ్రిని గెలుచుకుంది.
బీడర్మన్ 3 నిమిషాల 40.07 సెకెనులలో గమ్యాన్ని చేరుకోవడంతో గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ థోర్ప్ పేరిట ఉన్న 3 నిమిషాల 40.08 సెకెనుల పాత రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. అలాగే మహిళల విభాగంలో 4నిమిషాల 00.41 సెకెనులుగా ఉన్న పాత రికార్డ్‌ను చెరిపేస్తూ.. 3 నిమిషాలు 59.15 సెకెనుల సరికొత్త రికార్డును ఫెడరికా నెలకొల్పింది.
మరోవైపు మహిళల 100 మీటర్ల బటర్ ఫ్లై సెమీఫైనల్లో స్వీడన్‌కు చెందిన సారా సొస్ట్రోమ్ 56.44 సెకనుల ప్రపంచ రికార్డ్ నెలకొల్పగా.. మహిళల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లె సెమీస్‌లో అమెరికా స్విమ్మర్ అరియానా కుకోర్స్ 2నిమిషాల 07.03 సెకెనులు రికార్డును సొంతం చేసుకుంది. అలాగే మహిళల 4x100 ఫ్రీ స్టైల్ రిలే ఫైనల్లో నెగ్గి నెదర్లాండ్స్ 3 నిమిషాలు 31.72 సెకెనుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి గత రికార్డ్‌ను బ్రేక్ చేసింది. |