హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ఒలింపిక్ ఛాంపియన్ లిన్‌డాన్ (చైనా) కైవసం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ టైటిల్ లిన్‌డాన్ కైవసం చేసుకోవడం ఇది వరుసగా మూడోసారి. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మరో చైనా క్రీడాకారుడు చెన్ జిన్‌తో లిన్‌డాన్ టైటిల్ కోసం తలపడ్డాడు.
ఈ 25 ఏళ్ల సూపర్ డాన్ ఆట ప్రారంభంలో ఆచితూచి ఆడినప్పటికీ అనంతరం ప్రపంచ నెంబర్ టూ చెన్‌పై పట్టుభిగించాడు. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో లిన్‌డాన్ 21-18 21-16తో చెన్‌ను మట్టికరిపించాడు. ఐదో సీడ్‌గా బరిలో దిగినప్పటికీ లిన్‌డాన్‌నే అందరూ టైటిల్ ఫేవరెట్‌గా భావించారు. 2006, 2007, ఇప్పుడు 2009 ప్రపంచ బ్యాట్మిండన్ టైటిళ్లను గెలుచుకొని ఆటలో తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను వరుసగా మూడుసార్లు కైవసం చేసుకొని లిన్‌డాన్ రికార్డు కూడా సృష్టించాడు.
ఇంతకుముందు లిన్ డాన్ గత ఏడాది బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే మహిళల సింగిల్స్‌లోనూ చైనా క్రీడాకారిణిలే టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్, ఐదో సీడ్ జీ జింగ్‌ఫాంగ్ తన దేశానికే చెందిన ఏడో సీడ్ లులాన్‌తో పోటీ పడనుంది. మరోవైపు మహిళల డబుల్స్ ఫైనల్ కూడా చైనా క్రీడాకారిణిల మధ్య జరగబోతుంది.
పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లోనూ ఒక చైనా జట్టు ఉంది. అన్ని విభాగాల్లోనూ తమ క్రీడాకారులు ఫైనల్స్‌కు చేరడంతో బ్యాడ్మింటన్‌లో తమ ఆధిపత్యానికి అడ్డులేదని చైనా మరోసారి నిరూపించుకుంది. ఇదిలా ఉంటే మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ మాత్రం డెన్మార్క్‌కు వెళ్లింది. డెన్మార్క్ జోడి లేబౌర్న్- కెమిల్లా రిటర్ జూల్ ఈ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్స్‌లో వీరు ఇండోనేషియాకు చెందిన రెండో సీడ్ నోవావిదియాంతో- లిలియానా నాత్సిర్ జోడిపై 21-13, 21-17 స్కోరుతో గెలుపొందారు.