ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » స్క్వాష్ ఛాంపియన్‌షిప్ నుంచి ఘోషల్ ఔట్ (Sky open squash championship | Ghosal | Deepika Pallikal | Joshna Chinappa)
కైరోలో జరుగుతున్న స్కై ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత టాప్ ర్యాంకు ఆటగాడు సౌరవ్ ఘోషల్ వైదొలిగాడు. ఈ టోర్నీ తొలి రౌండులో నెదర్లాండ్సుకు చెందిన లారెన్స్ జాన్ అంజెమాతో జరిగిన పోరులో ఘోషల్ అనూహ్యంగా ఓటమి చవిచూశాడు.
వీరిద్దరి మధ్య మ్యాచ్ 54 నిమిషాల పాటు సాగింది. చివరికి 11వ సీడ్ అయిన అంజెమా చేతిలో.. 6-11, 11-5, 3-11, 4-11తో ప్రపంచ నెంబర్ 32వ ర్యాంకు క్రీడాకారుడైన ఘోషల్ పరాజయం పాలయ్యాడు. ఈ ఏడాదిలో తొలి సూపర్ సిరీస్ ప్లాటినం ఛాంపియన్‌షిప్‌గా ఈ పీఎస్ఏ వరల్డ్ స్క్వాష్ ఈవెంట్ జరుగుతోంది.
ఈ టోర్నీ క్వాలిఫై రౌండులో ఘోషల్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ప్రధాన రౌండుకు చేరుకున్నాడు. క్వాలిఫై రౌండులోని కీలక మ్యాచ్‌లు ఫ్రాన్స్‌కు చెందిన జులియెల్ బాల్బోపై 11-3, 11-0, 6-11, 11-9తో ఘోషల్ గెలుపొందాడు. మరోవైపు.. ఆమ్‌స్టర్‌డామ్‌లో జరుగుతున్న ఫోరెక్స్ మహిళా ప్రపంచ ఓపెన్ స్క్వాష్ 2009లో.. భారత్‌కు చెందిన ప్రపంచ నెంబర్ 35వ ర్యాంకర్ జోష్న చిన్నప్ప.. కూడా తొలి రౌండులోనే వెనుదిరిగింది.
ఈజిప్టుకు చెందిన 16వ సీడ్ రానీమ్ ఈ విలిలీ చేతిలో 5-11, 4-11, 6-11 జోష్నా కంగుతింది. ఇంకా మరో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికాల్ మాత్రం క్వాలిఫై రౌండు నుంచే వైదొలిగింది.