ఆర్థిక మాంద్యం దెబ్బ ఎంత తీసిందో.. దాని ప్రభావ ఫలితాలు ఇటీవలే అనేక విషయాలు మనం ఇది వరకే తెలుసుకున్నాం. ఆర్థిక సంక్షోభం ముగిసినప్పటికీ.. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలన్నీ ప్రస్తుతం రికవరీలో సైతం ఖర్చులను భారీగా తగ్గించే యత్నాలను మొదలెట్టిన సంగతి విదితమే.
జపాన్‌కు చెందిన మోటార్ వాహనాల తయారీ దిగ్గజం టయోటా మోటార్ సంస్థ కంపెనీ ఖర్చులను తగ్గించే యత్నంలో ప్రతిష్టాత్మకంగా భావించే.. ఫార్ములా వన్ (ఎఫ్1) బిడ్ నుంచి ఏకంగా తప్పుకోవాలని ప్రణాళిక చేస్తోంది. ఎఫ్1 రేసుల నుంచి తప్పుకుంటే.. చాలా వరకు రికవరీ చేసుకోవచ్చన్నది కంపెనీ ఉద్దేశ్యంగా తెలుస్తోంది.
ఎఫ్1 నుంచి తొలగడంపై నేడు టోక్యోలో టయోటా కంపెనీ బోర్డు సమావేశం జరుగనుంది. టయోటా కంపెనీ అధ్యక్షుడు అకియో టయోడా ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. ఈ సమావేశానంతరం అకియో మీడియాకు ఓ ప్రకటన చేయనున్నారు. వాస్తవానికి 2012 వరకు ఎఫ్1లో పాల్గొనడం కొనసాగించాలని ఈ ఆటో తయారీ దిగ్గజం నిర్ణయించింది.
అయితే.. ఖర్చుల రీత్యా చూస్తే.. వీలైనంత తర్వగా ఎఫ1 నుంచి బయటకు వచ్చేయడమే మంచిదని నిర్ణయించింది. అంతకుముందు ఆదివారం చేసిన ప్రకటనలో టయోటా.. 2012 తర్వాతే తాము వైదొలగుతామని తెలిపింది. ఆ తర్వాత తమ జట్టును విక్రయిస్తామని వివరించింది. కాగా, 2002లో ఎఫ్1లోకి టయోటా రంగ ప్రవేశం చేసింది.
కన్‌స్ట్రక్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో ఐదో ర్యాంకుతో ఈ సీజన్‌ను ముగించింది. అదలా ఉంచితే.. ఎఫ్1 నుంచి టయోటా వైదొలగాలని నిర్ణయిస్తే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ప్రీమియర్ ఆటోస్పోర్ట్‌లో జపాన్‌కు చెందిన ఒక్క ఆటో తయారీ సంస్థ కూడా ఉండదు.