ఇక టయోటా వంతు వచ్చేసింది. ఆర్థిక సంక్షోభంతో కంపెనీ కష్టాల్లో మరింత కూరుకుపోకుండా ఉండేందు కోసమని.. జపాన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజం టయోటా కంపెనీ.. ఫార్ములా వన్ రేసుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఇటీవల టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జ్‌స్టోన్ వైదొలగిన కొన్ని రోజుల తర్వాత తాజా టయోటా వైదొలగనుండటం గమనార్హం.
ఆర్థిక సంక్షోభం ముగిసినప్పటికీ.. అప్పటి కష్టాల నుంచి రికవరీ అయేందుకు అనేక ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే ప్రణాళికతో టయోటా కూడా ఎఫ్1 నుంచి వైదొలిగే నిర్ణయం చేసింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా తాము ఎఫ్1 నుంచి వైదొలగుతున్నట్లు టయోటా ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది సీజన్ ముగిసిన తర్వాత తాము ఎఫ్1 నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు టయోటా తెలిపింది. అబుదాబిలో ఆదివారంతో ఈ సీజన్ ఇప్పటికే ముగిసింది.
కాగా, దీనిపై స్పందించిన ఎఫ్1 నియంత్రణ సంస్థ అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ).. వైదొలగడానికి గల కారణాలను వెంటనే తెలపాల్సిందిగా టయోటాను ఆదేశించింది. టైర్ సరఫరా సంస్థ బ్రిడ్జ్‌స్టోన్ సైతం 2010 తర్వాత వైదొలగుతున్నట్లు ప్రకటించింది.
దీనికి సంబంధించి 18 నెలలకు ముందుగా నోటీసు కూడా ఇచ్చింది. దీని వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేందుకు వీలుంటుందన్నది ఎఫ్ఐఏ వాదన. ఇంత త్వరితంగా ఎఫ్1 నుంచి ఎందుకు వైదొలగుతున్నారో వెంటనే చెప్పాల్సిందిగా ఎఫ్ఐఏ వివరణ కోరింది.
అదలా ఉంచితే.. ఇప్పటికే.. హోండా జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూలు ఎఫ్1 నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఏదైతేనేం.. ఎఫ్1 మాత్రం రాను రాను తన కళను కోల్పోతోందని మాత్రం చెప్పొచ్చు.