ఫార్ములా వన్ నుంచి వైదొలిగే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రినాల్ట్ కంపెనీ ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన ఎఫ్1 జట్టు భవితవ్యంపై ఈ ఏడాది ముగింపులోగా ఖరారు చేస్తామని.. తుది నిర్ణయం తీసుకుంటామని రినాల్ట్ వెల్లడించింది. రినాల్ట్ కంపెనీ చీఫ్ కార్లోస్ ఘోషన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
రినాల్ట్ కంపెనీ వివరాల ప్రకారం ఇటీవల ఎఫ్1 నుంచి జపాన్‌కు చెందిన కార్ల తయారీ దిగ్గజం టయోటా వైదొలగిన నేపథ్యంలో.. ఇదే కోవలో కాకుండా, వైదొలిగే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఫ్రాన్స్‌లోని ఫ్లిన్స్‌లో కార్లోస్ మాట్లాడుతూ, బహిరంగ ప్రకటనలు ఇచ్చి తద్వారా జట్టు మరియు దాని భవితవ్యంపై ప్రభావం చూపాలనుకోవడం లేదన్నారు.
అయితే ఈ ఏడాది ముగింపులోగా.. ఎఫ్1లో తాము పాల్గొనడంపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. కాగా, ఓ ప్రముఖ ఛానెల్ వివరాల ప్రకారం, ఎఫ్1లో భవితవ్యంపై సమీక్షించేందు కోసం.. రినాల్ట్ కంపెనీ బోర్డు.. అత్యవసర సమావేశానికి హాజరైనట్లు తెలిపింది. జట్లకు మాత్రం ఇంజిన్ సరఫరా చేయడమా లేక.. పూర్తిగా ఇందులోంచి తప్పుకోవడమా అన్న విషయంపై ఈ సమావేశంలో చర్చించినట్లు వివరించింది.