ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా కప్ ఫైనల్లో భారత్: ప్రపంచకప్ బెర్త్ ఖరారు (India women Hockey | Asia Cup Hockey | 2010 Hockey World Cup)
ఈ సారి అవకాశాన్ని భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా అదే టోర్నీ అదే ప్రత్యర్థి (కొరియా)తో అదే సెమీస్‌లో.. అర్జెంటీనాలో 2010లో జరిగే ప్రపంచకప్ హాకీ బెర్త్ కోసం భారత మహిళల జట్టు పోరాడి గెలిచింది. దీంతో మహిళల ఆసియాకప్ హాకీ ఫైనల్లో బెర్త్ సంపాదించడమే కాకుండా. ప్రపంచకప్‌కు కూడా క్వాలిఫై అయింది.
జస్జీత్ కౌర్ రెండు సార్లు భారత్‌కు స్కోరును అందిస్తే.. రాణి రాంపాల్ మరో చేయి వేసింది. ఇందుకు మిగిలిన జట్టు పూర్తి సహకారం అందించింది. మొత్తానికి భారత జట్టు సమిష్టిగా రాణించి ఈ టోర్నీలో ఓటమే చవిచూడని దక్షిణ కొరియాపై 3-2తో విజయబావుటా ఎగురవేసింది.
వాస్తవానికి.. భారత్ 3-0తో మ్యాచ్ కైవసం చేసుకుంటుందేమో అని అంతా భావించారు. ఏకపక్షంగా భారత్ ఘనవిజయం అందుకుంటుందనుకున్నారు. కానీ కొరియా చివర్లో ధీటుగా స్పందించింది. దీంతో భారత్‌కు 3-2 ఆధిక్యం దక్కింది. ఈ విజయంతో ఫైనల్ చేరుకున్న భారత్.. చైనాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఇప్పటికే సెమీస్‌లో జపాన్‌పై చైనా గెలుపొందిన విషయం తెలిసిందే.