ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ : అఖిల్ జాతీయ రికార్డు (Sports | Chief Minister | Y.S. Rajasekhara Reddy | National Junior | Sub Junior Athletics Championship)
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక జాతీయ జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పోటీలలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు అఖిల్ ఫ్రాన్సిస్ జాతీయ రికార్డును నెలకొల్పాడు. వరంగల్‌లో జరుగుతున్న ఈ పోటీలలో అండర్-20 బాలుర 400 మీటర్ల హర్డిల్స్‌లో అఖిల్ 51.94 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
దీంతో.. అఖిల్ గతంలో నర్గీస్ (52.51) పేరుతో ఉన్న రికార్డును బద్ధలుకొట్టాడు. కాగా.. ఈ టోర్నీ నాలుగో రోజు పోటీలలో రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు 8 పతకాలను కైవసం చేసుకున్నారు. అండర్-14 బాలికల లాంగ్‌జంప్‌లో ఎం. ఇంధు (4.90 మీటర్లు), అండర్-14 బాలుర ట్రయథ్లాన్‌లో ఎల్. జనార్ధన్ రావు (1671 పాయింట్లు), అండర్-16 బాలుర 1500 మీటర్ల పరుగులో బాబ్జీ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు.
అలాగే... అండర్-14 బాలుర లాంగ్‌జంప్‌లో జనార్ధన్ రావు (5.78 మీటర్లు), అండర్-20 బాలికల 200 మీటర్ల పరుగులో సీహెచ్. శాంతి (25.12 సెకన్లు), అండర్-18 బాలికల 200 మీటర్లలో జి. మౌనిక (25.18 సెకన్లు)లు రజత పతకాలను దక్కించుకున్నారు. ఇక అండర్-20 బాలుర, 4,400 మీటర్ల హార్డిల్స్‌లో రాష్ట్ర జట్టు కాంస్యాన్ని నెగ్గింది.
నాలుగో రోజు పోటీల ముగింపుకు గత ఏడాది ఛాంపియన్ అయిన కేరళ జట్టు 22 స్వర్ణ, 25 రజత, 11 కాంస్య పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. తరువాత ఆంధ్రప్రదేశ్ జట్టు 7 స్వర్ణాలు, 4 రజతాలు, 13 కాంస్యాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.