ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఏటీపీ ఫైనల్స్ : టాప్-8 క్రీడాకారుల హోరాహోరి (Sports | ATP Finals | Top-8 | World Tour | World Men's Tennis | London | Federer | Rafael Nadal | Andy)
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సీజన్‌లో భాగంగా చివరిదైన వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో.. ప్రపంచ పురుషుల టెన్నిస్‌లోని టాప్-8 క్రీడాకారుల మధ్య హోరాహోరి పోరుకు లండన్ వేదిక కానుంది. ఆదివారం నుంచి ఓటు ఎరీనాలో జరుగనున్న ఏటీపీ ఫైనల్స్‌లో టెన్నిస్ ధిగ్గజాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
ప్రస్తుత నెంబర్‌వన్ ఫెదరర్, రఫెల్ నాదల్, ఆండీ ముర్రే, డెల్ పొట్రో, జొకోవిచ్, వెర్దాస్కో.. తదితరులు ఏటీపీ ఫైనల్స్‌లో పాల్గోనున్నారు. తొలి రోజున సింగిల్స్‌లో ఆండీ ముర్రేతో డెల్ పొట్రో, వెర్దాస్కోతో ఫెదరర్ ఢీ కొట్టనున్నారు. అలాగే డబుల్స్ విభాగంలో టాప్-8 జోడీలు బరిలో దిగనున్నాయి. భారత్ తరపున లియాండర్ పేస్-లూహీ (చెక్ రిపబ్లిక్), మహేశ్ భూపతి-మార్క్ నోల్స్ (బహమాస్)లు తలపడనున్నారు.
ఇదిలా ఉంటే... ఈ పోటీల సింగిల్స్ విభాగంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలిచిన వారికి 16 లక్షల 30 వేల డాలర్ల (భారత కరెన్సీలో రూ. 7 కోట్ల, 58 లక్షలు) ఫ్రైజ్‌మనీ దక్కుతుంది. అలాగే ఈ టోర్నీలో పాల్గొన్నందుకుగానూ ఒక్కో క్రీడాకారుడికి లక్షా 20 వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ. 55 లక్షల 85 వేలు) మ్యాచ్ ఫీజుగా లభిస్తుంది.
ఇక డబుల్స్ విభాగంలో అయితే టైటిల్ సాధించిన జోడీకి రెండు లక్షల 87 వేల ఐదు వందల డాలర్ల (భారత కరెన్సీలో రూ. కోటీ 33 లక్షలు) ఫ్రైజ్ మనీ సొంతమవుతుంది. ఈ టోర్నీ సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ... టైటిల్ సాధిస్తే నెంబర్‌వన్ స్థానం నిలుస్తుందని తెలుసనీ.. అయితే అది అంత సులువేమీ కాదని అన్నాడు.
గాయాల నుంచి తేరుకున్న తాను ఇప్పుడు శారీరకంగా, మానసికంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాననీ.. రఫెల్ నాదల్ పేర్కొన్నాడు. ప్రపంచంలోని మేటి ఆటగాళ్లతో ఆడుతున్నాననీ.. ప్రతి మ్యాచ్‌లోనూ గెలవవచ్చు, అదే సమయంలో ఓడిపోనూ వచ్చనీ... అయితే తన ఏకైక లక్ష్యం లండన్‌లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించటమేనని ఆయన వివరించాడు.