దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ ఆతిథ్య మిచ్చే హాకీ ప్రపంచ కప్‌లో ఆడే పాకిస్థాన్ హాకీ జట్టును ఆ దేశ హాకీ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు జరగనున్న 2010 పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో ఆడే పాకిస్థాన్ జట్టుకు సీజన్డ్ డిఫెండర్ జీషాన్ అష్రఫ్ కెప్టెన్సీ సారథ్యం వహించనున్నాడు.
18 మంది సభ్యులతో కూడిన పాకిస్థాన్ హాకీలో నైపుణ్యం గల ఫార్వర్డ్ వాకస్ షరీఫ్‌ను గాయం కారణంగా సెలక్టర్లు తొలగించారు. ఇక.. గోలీ సల్మాన్ అక్బెర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు.
ఇకపోతే.. న్యూఢిల్లీకి ఫిబ్రవరి 22న బయలుదేరనున్న పాక్ జట్టుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావల్సి ఉంది. ఈ హాకీ టోర్నీలో భారత్, పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జర్మనీ, అర్జెంటీనా, కెనడా, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్‌లు పాల్గొంటున్నాయి.