దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో జరుగనున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడా పోటీల నుంచి ప్రముఖ అథ్లెటిక్ అంజు జార్జ్ తప్పుకుంది. కామన్వెల్త్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పోటీల్లో తాను పాల్గొనడం లేదని భారతీయ మాజీ అథ్లెటిక్ క్రీడాకారిణి అంజు జార్జ్ (32) ప్రకటించింది.
వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు అంజు జార్జ్ తెలిపింది. ఈ నిర్ణయంతో తాను పూర్తిగా అథ్లెటిక్ నుంచి తప్పుకోవడం లేదని అంజు జార్జ్ స్పష్టం చేసింది. 2012వ సంవత్సరంలో లండన్ ఒలింపిక్ పోటీలకు సిద్ధమయ్యేందు కోసమే.. కామన్వెల్త్ క్రీడలకు దూరమవుతున్నానని అంజు జార్జ్ వెల్లడించింది.