ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బోపన్న జోడీకి తొలి ఏటీపీ టూర్ డబుల్స్ టైటిల్ (Rohan Bopanna, Aisam Qureshi, ATP trophy, South African Open, Johannesburg)
జొహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్‌లో భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, పాకిస్థాన్‌కు చెందిన ఐజామ్ ఉల్ హక్ ఖురేషీల జంట తమ కెరీర్‌లోనే తొలిసారిగా ఏటీపీ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా ఓపెన్ ఫైనల్స్‌లో అన్‌సీడెడ్ బోపన్న-ఖురేషీ జోడీ స్లొవేకియాకు చెందిన కారోల్ బెక్, ఇజ్రాయెల్‌కు చెందిన హారెల్ లెవీ ద్వయంపై 206, 6-3, 10-5 స్కోరు తేడాతో విజయం సాధించింది.
కాగా.. విజేతగా నిలిచిన బోపన్న-ఖురేషీలకు 250 ఏటీపీ పాయింట్లతోపాటు 24, 350 డాలర్లు (భారత కరెన్సీలో పదకొండు లక్షల 35 వేల రూపాయలు) ఫ్రైజ్‌మనీగా లభించింది. గతంలో ముంబై, న్యూపోర్ట్ ఏటీపీ టోర్నీలలో ఫైనల్స్‌కు చేరుకున్న ఈ ఇండో-పాక్ జోడీ రన్నరప్‌తో మాత్రమే సరిపెట్టుకున్నారు. అయితే మూడో ప్రయత్నంలో మాత్రం విజయభేరి మ్రోగించారు.
విజయానంతరం బోపన్న-ఖురేషీల జంట మాట్లాడుతూ... ఈ విజయం తమ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసిందని, ర్యాంకింగ్ కూడా మెరుగవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రారంభంలో కాస్తంత తడబడినా, వర్షంవల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడటం తమకు బాగా కలిసి వచ్చిందని, విరామంలో ఎలా ఆడాలో చర్చించుకుని, పోరాడి నెగ్గామన్నారు. ఈ ఏడాది మరిన్ని టోర్నమెంట్‌లలో కలిసి ఆడతామనీ రోహన్-బోపన్నలు ఇదే సందర్భంగా వెల్లడించారు.