ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » శాఫ్ క్రీడలు : భారత్ ఖాతాలో మరో పది స్వర్ణాలు (Bangladesh | Dhaka | South Asian Games | Gold Medals | Silver Medals | Bronze Medals)
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరుగుతున్న దక్షిణాసియా (శాఫ్) క్రీడల్లో భారత్ పసిడి పతకాల వేటలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ఆదివారం ఒక్కరోజే భారత్ ఖాతాలో పది స్వర్ణాలు, 12 రజతాలు, 8 కాంస్య పతకాలు వచ్చి చేరాయి. కాగా.. పతకాల పట్టికలో ఓవరాల్‌గా భారత్ 67 స్వర్ణ, 40 రజత, 22 కాంస్య పతకాలతో మొత్తం 129 పతకాలను సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఆదివారం జరిగిన గేమ్‌లలో షూటింగ్‌లో సురేంద్ర సింగ్ రాథోడ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో 1172 పాయింట్లను స్కోరు చేయటమేగాక, మీట్ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అథ్లెటిక్స్ 400 మీటర్లలో బిబిన్ మాథ్యూ, జావెలిన్ త్రోలో కాశీనాథ్ నాయక్, మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో గాయత్రిలు బంగారు పతకాలను గెలుపొందారు.
అలాగే శనివారం పురుషుల 200 మీటర్ల రేసులో బంగారాన్ని సాధించిన హైదరాబాదీ అథ్లెట్ అబ్దుల్ నజీబ్ ఖురేషీ ఆదివారం 4100 మీటర్ల రిలేలో కూడా రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నజీబ్, అరుణ్‌జీత్, షమిర్మోన్, రితేశ్ ఆనంద్‌లతో కూడిన భారత బృందం 40.18 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. 40.02 సెకన్లతో శ్రీలంక బృందం స్వర్ణ పతకాన్ని గెలుపొందింది.
ఇక స్విమ్మింగ్‌లో అయితే భారత్‌కు నాలుగు పసిడి పతకాలు లభించాయి. 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సందీప్ సెజ్వాల్ మీట్ రికార్డు నమోదు చేసి, స్వర్ణ పతకాన్ని సంపాదించాడు. అలాగే 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బాలకృష్ణన్, 100 మీటర్ల బటర్ ఫ్లయ్‌లో అర్జున్ మురళీధరన్, మహిళల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఫారియా జమాన్ కూడా స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు.
పురుషుల హాకీ ఫైనల్ విషయానికి వస్తే.. భారత్ 4-5 గోల్స్ తేడాతో టైబ్రేకర్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో పరాజయం చవిచూసింది. నిర్ణీత సమయం పూర్తయిన తరువాత రెండు జట్లు 1-1 వద్ద సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే టైబ్రేకర్‌లో భారత్ తరపున రఘునాథ్, ఇన్నోసెంట్ కుల్లు, వికాస్ పిళ్లైలు సఫలం కాగా, ధరమ్‌వీర్, వరిందర్‌జిత్ సింగ్ గురితప్పారు. పాక్ తరపున సిద్దిఖి, కాషిఫ్ జవాద్, అబ్బాస్, కెప్టెన్ సబ్తేన్ రాజా సఫలమై గెలుపొందారు.