ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » నిషేధం కుదించినా, అన్యాయమే జరిగింది: శివేంద్ర (Shivendra Singh, Jose Brasa, FIH, Fareed Ahmed, Ken Read)
అంతర్జాతీయ హాకీ సమాఖ్య విధించిన 3 మ్యాచ్‌ల నిషేధాన్ని రెండింటికి కుదించినా, తనకు అన్యాయమే జరిగిందని భారత హాకీ స్ట్రైకర్ శివేంద్ర సింగ్ మంగళవారం వాపోయాడు. ఉద్దేశ్యపూర్వకంగా తాను ఎలాంటి తప్పూ చేయనప్పటికీ, హాకీ ప్రపంచకప్ టోర్నీ డైరెక్టర్ కెన్ రీడ్ తనపై నిషేధం విధించటం చాలా బాధాకరమని అన్నాడు.
కెన్ రీడ్ నిర్ణయం తనను ఎంతగానో కలచివేసిందనీ, ఎఫ్ఐహెచ్ తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రం న్యాయంలేదని శివేంద్ర వాపోయాడు. తాను ఉద్దేశ్యపూర్వకంగా పాక్ ఆటగాడిని కొట్టలేదనీ, బంతి కోసం పరుగెడుతుండగా స్టిక్ జారిపోయి అతడికి తగిలిందని వివరించాడు. అంతేగానీ తాను కావాలనే ఫరీద్‌ను కొట్టలేదనీ, అదో యాక్సిడెంట్ మాత్రమేనన్నాడు.
పాక్‌తో మ్యాచ్ ఆడినరోజు తనకు ఇదో పెద్ద విషయం కాకపోయినా.. ఆస్ట్రేలియాతో తలపడే కీలకమైన మ్యాచ్‌లో తాను ఉండనని తలచుకుంటేనే చాలా బాధగా ఉందని శివేంద్ర వ్యాఖ్యానించాడు. అదే విధంగా స్పెయిన్‌తో ఆడే మ్యాచ్‌కు కూడా శివేంద్ర అందుబాటులో ఉండని సంగతి తెలిసిందే. అయితే.. ఈ రెండు మ్యాచ్‌లలో ఉండకపోయినా, ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో తిరిగీ జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే.. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థానీ ఆటగాడు ఫరీద్‌ను దురుసుగా అడ్డుకున్నందుకు ప్రపంచకప్ టోర్నీ డైరెక్టర్ కీన్ రీడ్ సోమవారం శివేంద్రపై మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఆ తరువాత శివేంద్రపై విధించిన 3 మ్యాచ్‌ల నిషేధాన్ని 2 మ్యాచ్‌లకు కుదించినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో శివేంద్ర మాట్లాడుతూ.. ఏమయితేనే తనకు అన్యాయం జరిగిందన్నాడు.