ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » హాకీ ప్రపంచకప్: దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం (Hockey World cup | South Africa | England | Marvin Harper)
హాకీ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మంగళవారం జరిగిన పూల్-బి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-4 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో ప్రపంచకప్ హాకీలో ఇంగ్లండ్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఆట ప్రారంభం నుంచే రెండు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్విన్ హర్పర్ పదవ నిమిషంలోనే గోల్ చేసి జట్టుకు ఆధిక్యం సంపాదించిపెట్టాడు. అయితే ఆటకు 15వ నిమిషంలోనే ఇంగ్లండ్ ఆటగాడు రిచర్డ్ మాన్‌టెల్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. కొద్దిసేపటికే రాబర్ట్ ముర్రె ఇంగ్లండ్‌కు రెండో గోల్‌ను సంపాదించిపెట్టాడు.
కానీ దక్షిణాఫ్రికా ఆటగాడు నోరిస్ జోన్స్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. దీంతో ప్రథమార్ధంలో రెండు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. ద్వితీయార్ధంలో ఇంగ్లాండ్ విజృంభించింది. వెంటవెంటనే నాలుగు గోల్స్ చేసి తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
43వ నిమిషంలో అష్లే జాక్సన్ జట్టుకు మూడో గోల్ అందించాడు. 50వ నిమిషంలో నిక్ క్యాట్లిన్ నాలుగో గోల్ సాధించి పెట్టాడు. తర్వాతి నిమిషంలోనే లెన్ మాక్‌కె ఐదో గోల్ అందించాడు. దీంతో ఇంగ్లండ్ 5-2 తేడాతో పటిష్టస్థితిలో నిలిచింది.
అయితే ఆటకు 53 నిమిషంలో దక్షిణాఫ్రికా మూడో గోల్ సాధించింది. 57వ నిముషంలో ఇంగ్లాండ్ ఆటగాడు రిచర్డ్ తన రెండో గోల్‌తో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని 6-3కు పెంచాడు. 67వ నిమిషంలో టార్న్‌టన్ దక్షిణాఫ్రికాకు నాలుగో గోల్ అందించాడు. చివరికి ఆధిక్యాన్ని కూడబెట్టుకున్న ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా విజయభేరి మోగించింది.
ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ హాకీ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఆరు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. అంతేగాకుండా.. 1971 నుంచి ఇప్పటివరకు ఇది ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు 500వ మ్యాచ్ కావడం విశేషం.