అమెరికాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నల్లకలువ వీనస్ విలియమ్స్ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ విభాగం ఆరంభ రౌండ్లో వీనస్ విలియమ్స్ ఇటలీకి చెందిన రాబెర్టా విన్సీని 6-4, 6-1 సెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫలితంగా మహిళల సింగిల్స్ రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. ఆద్యంతం ప్రత్యర్థిని గట్టి షాట్లతో కట్టడి చేసిన వీనస్ విలియమ్స్ తొలి రౌండ్లో విజేతగా నిలిచింది.
ఇదేవిధంగా ఫ్రాన్సెస్కా షియవోన్ 6-1, 6-0 తేడాతో అయూమీ వౌరిటా (జపాన్)పై సునాయాసంగా విజయం సాధించగా, రెండో సీడ్‌గా బరిలోకి దిగిన కిమ్ క్లియస్టర్స్ 6-0, 7-5 సెట్ల తేడాతో గ్రెటా అర్న్ (హంగరీ)ను చిత్తు చేసింది.
మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో యుఎస్ ఓపెన్‌లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్, స్వీడన్‌కు చెందిన రాబిన్ సోడెర్లింగ్, అమెరికాకు చెందిన ఆండీ రాడిక్‌లు రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు.