ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » అమెరికా ఓపెన్: రెండో రౌండ్లో సానియా మీర్జా ఓటమి! (Sania Mirza | America Open | Grand Slam | Tennis | Azarenko | Tennis | Sports)
అమెరికా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పోరు ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో విజయాన్ని నమోదు చేసుకున్న సానియా మీర్జా రెండో రౌండ్లో చిత్తుగా ఓడిపోయింది.
ప్రస్తుతం 159 ర్యాంకులో ఉన్న సానియా మీర్జా మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అనాస్టాసియా చేతిలో ఖంగుతింది. రష్యాకు చెందిన అనస్టాసియాతో బరిలోకి దిగిన సానియా మీర్జా ప్రత్యర్థి షాట్లను ధీటుగా ఎదుర్కోవడంలో విఫలమైంది.
ఈ క్రమంలో తొలి సెట్‌ను కోల్పోయిన సానియా రెండో సెట్‌లో కొంత మెరుగ్గా ఆడింది. అయితే చివరి సెట్‌లో 4-4 పాయింట్లతో సమమైన ఆధిక్యం లభించింది. కానీ కీలక సమయంలో సానియా చేసిన తప్పిదంతో మీర్జాకు పరాజయం తప్పలేదు.
81 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో అనస్టాసియా 6-2, 6-4 తేడాతో సానియాను మట్టికరిపించి, మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో సెర్బియాకు చెందిన ఇవనోవిచ్ 6-3, 6-0 తేడాతో చైనాకు చెందిన జీ చెంగ్‌ను మట్టకిరిపించారు.
ఇకపోతే.. న్యూయార్క్‌లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో విక్టోరియా అజారెంకో అనూహ్య ఓటమిని నమోదు చేసుకుంది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రత్యర్థిపై గట్టిపోటీని ప్రదర్శించలేకపోయిన అజారెంకో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 21 ఏళ్ల అజారెంకో రెండో రౌండ్ మ్యాచ్‌లో అర్జెంటీనాకు చెందిన గిసెల్లా డుల్కో చేతిలో పరాజయం పాలైంది.
వేడి తాకిడికి అజారెంకో స్పృహతప్పి కిందపడిపోయింది. దీంతో అభిమానులందరూ ఆవేదనకు గురైయ్యారు. స్పృహతప్పి పడిపోయిన అజారెంకో నీరసంగా ఉన్నారని, ఆమెకు చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో ఈ మ్యాచ్ నుంచి అజారెంకో వైదొలగింది.