ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో సెర్బియా బ్యూటీ ఇవనోవిచ్ జోరుకు కళ్లెంపడింది. మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ క్లియస్టర్స్, ఇవనోవిచ్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.
ఈ బెల్జియం స్టార్ ప్రత్యర్థిపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించి 6-2, 6-1తో తేడాతో మాజీ నెంబర్ వన్ అయిన ఇవనోవిచ్‌కు చెక్ పెట్టింది. మరో సింగిల్స్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ఓపెన్ విజేత షియవోన్ (ఇటలీ) 6-3, 6-0తో పావ్‌ల్యుచెన్‌కోవా (రష్యా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఇకపోతే పురుషుల సింగిల్స్‌లో జకోవిక్ (సెర్బియా) 6-1, 7-6 (7/4), 6-3తో జేమ్స్ బ్లేక్ (అమెరికా)పై, డేవిడ్ ఫెర్రర్ (స్పెయిన్) 7-6 (2), 6-2, 6-2తో సహచరుడు గిమెనో-ట్రేవర్‌పై నెగ్గి నాలుగోరౌండ్లోకి అడుగుపెట్టారు.
అయితే యూఎస్ ఓపెన్ డబుల్స్ విభాగంలో ఇప్పటికే వెనుదిరిగిన భూపతి జోడీకి మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ చుక్కెదురైంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలిరౌండ్‌లో భూపతి, హంతుచోవా (స్లోవేకియా) ద్వయం 4-6, 2-6తో కనేపి (ఇస్తోనియా), లిండ్సెల్ట్ (స్వీడన్) జంట చేతిలో పరాజయం పాలైంది.