యూపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నేటి ఉదయం బీజింగ్ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం జరుగనున్న బీజింగ్ ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోనియా పలు అంశాలపై కీలక చర్చలు జరుపనున్నారు. భేటీలో భాగంగా కాంగ్రెస్, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య పలు అంశాలపై చర్చలు జరుగనున్నాయి.
సోనియా, రాహుల్ గాంధీలతోపాటు ప్రియాంక గాంధీ ఆమె భర్త రాబర్ట్ వధేరా, భారతదేశ విదేశాంగ సహాయమంత్రి ఆనంద్ శర్మలు కూడా హాజరుకానున్నారు. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా సోనియా కుటుంబ సభ్యులను సీపీసి అధిష్టానం కోరిన సంగతి విదితమే.
ఒలింపిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుమారు లక్షా 60 వేల మంది హాజరుకానన్నట్లు అంచనా. కాగా సోనియా గాంధీ చైనాలో ఈ ఏడాదిలో పర్యటించటం ఇది రెండోసారి. పర్యటనలో భాగంగా సోనియా చైనా ఉపాధ్యక్షులు క్జి జిన్ పింగ్‌తో సమావేశమవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరుపుతారు. ఇరు పార్టీలకు సంబంధించి కొన్ని అంశాలపై నేతలు సంతకాలు చేస్తారు. చైనా అధ్యక్షుడు హు జింటావో ఇచ్చే విందులో సోనియా, రాహుల్ పాల్గొంటారు. ఈ విందు కార్యక్రమంలో అమెరికా అధ్యక్షలు జార్జ్ బుష్, బ్రిటన్ ప్రధాని బ్రౌన్, ఫ్రెంచ్ ప్రధాని నికోలస్ సార్కోజీతోపాటు సుమారు 80 మంది ప్రముఖులు పాల్గొననున్నారు.
ఆగస్టు 08-08-08వ తేదీ (రేపు) రాత్రి 08.08 గంటలకు ఒలింపిక్స్ క్రీడోత్సవాలు బీజింగ్‌లో ప్రారంభం కానున్నాయి. చైనా అదృష్ట సంఖ్య ఎనిమిది కావడంతో... 8వ తేదీన ప్రారంభమయ్యే ఒలింపిక్స్ క్రీడలతో దేశానికి శుభం కలుగుతుందని చైనీయులు విశ్వసిస్తున్నారు. మరోవైపు 8వ తేదీన వివాహం చేసుకోడానికి ఇప్పటి వరకు 16,400 జంటలు సిద్ధమయ్యాయి.
కాగా... ఒలింపిక్ జ్యోతి యాత్ర చివరి అంకానికి చేరింది. నిరసనల మధ్య ప్రపంచ నగరాలను చుట్టివచ్చిన రిలే... చివరికి బీజింగ్ చేరుకుంది. బుధవారం నగరంలోకి ప్రవేశించిన ఒలింపిక్ జ్యోతికి బీజింగ్ ప్రజలు ఘన స్వాగతం పలికారు.
|