ఆరోగ్యం సరిగాలేని కారణంగా అమెరికాకు చెందిన బాక్సింగ్ క్రీడాకారుడు గారీ రస్సెల్ జూనియర్ ఒలింపిక్ పోటీనుంచి తప్పుకున్నాడు. శరీరంలో నీటిని కోల్పోవడం ద్వారా రస్సెల్ అపస్మారక స్థితికి చేరుకున్నట్టు అమెరికా బాక్సింగ్ జట్టు పేర్కొంది.
ఈ విషయమై అమెరికా బాక్సింగ్ కోచ్ డాన్ కాంప్‌బెల్ మాట్లాడుతూ శరీరంలోని నీటిని కోల్పోయిన కారణంగా శుక్రవారం ఉదయం రస్సెల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడని తెలిపారు. ప్రస్తుతం ఒలింపిక్ గ్రామంలో ఉంటోన్న రస్సెల్‌కు అక్కడి డాక్టర్లు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే శుక్రవారం జరిగే పోటీల్లో అతను పాల్గొనే అవకాశం లేదని డాక్టర్లు చెప్పినట్టుగా కాంప్‌బెల్ తెలిపారు.
రెండుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలబడ్డ రస్సెల్ ఈసారి ఒలింపిక్ పతకం సాధించే అవకాశం ఉందని అమెరికా చాలా ఆశలు పెట్టుకుంది. అయితే పోటీలకు ముందే రస్సెల్ ఇలా పోటీలనుంచి నిష్క్రమించడం అమెరికా అభిమానులకు తీవ్ర నిరాశ కల్గించింది.
|