వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి మోనికా దేవిని బీజింగ్ ఒలింపిక్స్ నుంచి నిషేధించడాన్నినిరసిస్తూ మణిపూర్‌లో శుక్రవారం బంద్ కొనసాగుతోంది. మోనికకు మద్దతుగా వివిధ సామాజిక సంస్థలు చేపట్టిన ఈ బంధ్ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగనుంది.
అధికారుల వివరణ ప్రకారం మణిపూర్‌లోని వివిధ సామాజిక సంస్థలు, యునైటెడ్ కమిటీ మణిపూర్ (యూసీఎమ్) పిలుపు మేరకు కొనసాగుతున్న ఈ బంద్ కారణంగా మణిపూర్‌లో శుక్రవారం సాధారణ పౌరజీవనం స్థంబించింది. షాపులు, వ్యాపార సంస్థలను నిరసనకారులు మూయించివేశారు.
మణిపూర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రవాణ వ్యవస్థను కూడా నిరసనకారులు ఆపివేశారు. రోడ్లపై చేరుకున్న క్రీడాభిమానులు టైర్లను తగలబెట్టడం ద్వారా తమ నిరసన తెలియజేశారు. అయితే ఈ బంద్ కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని పోలీసుశాఖ పేర్కొంది.
ఒలింపిక్ పోటీలకు ఎంపికైన మోనికా దేవికి నిర్వహించిన డోపింగ్ పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో చివరి నిమిషంలో ఆమెను ఒలింపిక్ పోటీలనుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే మోనికా దేవి విషయంలో కావాలనే ఇలా చేశారంటూ మణిపూర్ ఒలింపిక్ శాఖ ఆరోపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి పూజారి శైలజను మోనికా దేవి స్థానంలో బీజింగ్ ఒలింపిక్‌కు పంపడం కోసమే ఇదంతా జరుగుతోందని మణిపూర్ ఒలింపిక్ శాఖ పేర్కొంది. ఇప్పటివరకూ ఎప్పుడూ డోపింగ్ పరీక్షల్లో దోషిగా తేలని మోనికాదేవిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో క్రీడాభిమానులు సైతం భారత ఒలింపిక్ సంఘం నిర్వాహకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
|