ఒలింపిక్ చరిత్రలో అత్యధిక స్వర్ణాలు గెలిచిన వ్యక్తిగా అమెరికా స్విమ్మింగ్ క్రీడాకారుడు పెల్ప్స్ ప్రపంచ రికార్డు సాధించాడు. బీజింగ్‌లో బుధవారం జరిగిన 200 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో స్వర్ణం సాధించడం ద్వారా పెల్ప్స్ ఈ ఘనత సాధించాడు.
బీజింగ్ ఒలింపిక్స్‌లో బుధవారం నాటికి పెల్ప్స్ సాధించిన స్వర్ణాల సంఖ్య నాలుగుకు చేరింది. అదేసమయంలో పెల్ప్స్ ఇంకా నాలుగు ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉండడంతో ఒకే ఒలింపిక్స్‌లో ఎక్కువ స్వర్ణాలు సాధించిన రికార్డును కూడా తిరగరాసే పనిలో పడ్డాడు.
గత 2004 ఒలింపిక్స్‌లో పాల్గొన్న పెల్ప్స్ ఏకంగా ఆరు స్వర్ణాలు సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ప్రస్తుత బీజింగ్ ఒలింపిక్స్‌లో భాగంగా మంగళవారం మూడో స్వర్ణాన్ని సాధించిన పెల్ప్స్ అత్యధిక ఒలింపిక్ స్వర్ణాలు సాధించిన మార్క్ స్పిట్జ్, కార్ల్ లెవీస్‌ల సరసన నిలిచిన సంగతి తెలిసిందే.
అంతకుముందు వ్యక్తిగత 400 మీటర్ల పోటీలో ఫెల్ప్స్‌కు తొలి స్వర్ణం లభించింది. అలాగే సోమవారం జరిగిన 4-100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో ఫెల్ప్స్ పాల్గొన్న జట్టుకు స్వర్ణం లభించింది. దీంతో బుధవారం నాటికి పెల్ప్స్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు వచ్చి చేరాయి.
|