బీజింగ్ ఒలింపిక్స్‌లో భాగంగా బుధవారం జరిగిన వెయిట్ లిప్టింగ్ పోటీల్లో హంగేరీ క్రీడాకారుడు స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు. వెయిట్ లిప్టింగ్ క్రీడాకారుడైన ఇతను బరువును ఎత్తే సమయంలో భుజం నొప్పి రావడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు.
హంగేరికి చెందిన జాన్స్ బరాన్‌యాయ్ బుధవారం జరిగిన 77 కేజీల వెయిట్ లిప్టింగ్ విభాగంలో పోటీ పడ్డాడు. ఇందులో భాగంగా 148 కేజీల బరువును ఎత్తడానికి ప్రయత్నించిన అతను భుజంలోని కండరాలు పట్టేయడంతో ఒక్కసారిగా స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.
కిందపడ్డ అతను నొప్పిని భరించలేక గట్టిగా అరవడం ప్రారంభించాడు. దీంతో అక్కడ ఉన్న నిర్వాహకులు వెంటనే అతన్ని అక్కడినుంచి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై నిర్వాహకులు మాట్లాడుతూ జాన్స్‌కు ఏర్పడిన గాయం ఏపాటిదో డాక్టర్లు నిర్థారిస్తే తప్ప తామేమీ చెప్పలేమని పేర్కొన్నారు.
|