భారత టెన్నిస్ జోడీ లియాండర్ పేస్, మహేష్ భూపతి మరోసారి కోట్లాది మంది ప్రజల ఆశలను నీరుగార్చారు. బీజింగ్ ఒలింపిక్ పోటీల్లో భాగంగా.. డబుల్స్ విభాగంలో ఓటమి చెందారు. శుక్రవారం జరిగిన డబుల్స్ టెన్నిస్ పోటీలో నాలుగో సీడ్ స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్, స్టైనిస్లాస్ వావర్నికా చేతిలో పరాజయం పాలయ్యారు.
గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జంట 1-4 తేడాతో వెనుకబడిన విషయం తెల్సిందే. ఆ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను శుక్రవారానికి వాయిదా వేశారు. ఆ ప్రకారంగా నేడు మ్యాచ్‌ను తిరిగి నిర్వహించారు. ఇందులో తిరిగి పుంజుకునేందుకు భారత జంట పూర్తిగా విఫలమైంది. దీంతో మ్యాచ్‌ను 6-2, 6-4 సెట్ల తేడాతో ఓటమి పాలైంది.
ఈ పరాజయంతో టెన్నిస్ విభాగంలో బంగారు పతక ఆశలు మృగ్యమయ్యాయి. గురువారం జరిగిన సింగిల్స్ పోటీల్లో జేమ్స్ బ్లాక్ చేతిలో ఓటమి పాలైన రోజర్ ఫెదరర్.. డబుల్స్ విభాగంలో మాత్రం గట్టిపట్టుదలతో ఆడి భారత జోడీని ఇబ్బందులకు గురి చేశాడు. మ్యాచ్ ఆరంభం నుంచి స్విస్ జోడీ భారత జంటపై ఆధిపత్యం చెలాయించింది. ఏ దశంలోనూ స్విస్ జంట చిన్న పొరపాటు చేయకుండా ప్రతి సెట్‌లోనూ ఆధిక్యం సాధించారు.
|