బీజింగ్ ఒలింపిక్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా విజేందర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. బీజింగ్‌లో బుధవారం సాయంత్రం జరిగిన 75 కేజీల మిడిల్ వెయిట్ క్వార్టర్స్ పోరులో విజయం సాధించడం ద్వారా విజయవంతంగా సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. దీంతో భారత పతకాల ఖాతాలో మరో పతకం చేరినట్టైంది.
క్వార్టర్స్ పోరులో ఈక్విడార్ బాక్సర్ గోంగోరాను ఓడించడం ద్వారా విజేందర్ భారత్ అభిమానులను ఆనందింపజేశాడు. క్వార్టర్స్ పోరులో ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించడం ద్వారా విజేందర్ తన సత్తా ప్రదర్శించాడు. దీంతో 9-4 తేడాతో గోంగారాపై విజేందర్ విజయం సాధించాడు.
తద్వారా సెమీస్‌లో ఒకవేళ విజేందర్ ఓడినప్పటికీ కాంస్య పతకం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. బీజింగ్ ఒలింపిక్స్‌లో సత్తా ప్రదర్శించిన విజేందర్ కెరీర్‌లో మరెన్నో విజయాలు ఉండడం విశేషం. ఈ ఏడాది అకోలాలో జరిగిన సూపర్ కప్ ఇంటర్ జోనల్ నేషనల్ బాక్సింగ్‌లో విజేందర్ స్వర్ణం సాధించాడు.
అలాగే కజికిస్థాన్‌లో జరిగిన మూడవ ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లోనూ స్వర్ణాన్ని సాధించడం ద్వారా విజేందర్ బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. వీటితో పాటు జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో కూడా విజేందర్ స్వర్ణం సాధించాడు. ఇవి మాత్రమే కాక గత ఏడాది ఢిల్లీలో జరిగిన సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా విజేందర్ స్వర్ణం సాధించడం విశేషం.
|