బీజింగ్ ఒలింపిక్‌లోని 120 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత యోధుడు రాజివ్ థోమర్ తొలి రౌండ్‌లో ఓటమి చవిచూశాడు. అమెరికా రెజ్లర్ స్టీవ్ మోక్కోతో తలపడిన రాజివ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేక పోయాడు.
బీజింగ్‌లో గురువారం ఉదయం జరిగిన ఈ పోటీలోని రెండు రౌండ్లలోనూ రాజివ్ ఒక్క పాయింట్ కూడా తీయలేక పోవడం గమనార్హం. అయితే రాజీవ్ ప్రత్యర్ధి స్టీవ్ మాత్రం తొలి రౌండ్లో ఓ పాయింట్ సాధించాడు. అదే ఊపులో రెండో రౌండ్లోనూ స్టీవ్ మరో రెండు పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు.
అయితే రాజివ్ అదృష్టం బాగుంటే అతనికి మరో అవకాశం ఉంది. అదేంటంటే రాజీవ్ తొలి రౌండ్ ప్రత్యర్థి స్టీవ్ ఫైనల్‌కు చేరగల్గితే రెపిచేజ్ రౌండ్లో రాజివ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ రెపిచేజ్ అవకాశంతోనే బుధవారం జరిగిన పోరులో విజయం సాధించిన భారత్ యోధుడు సుశీల్ కుమార్ కాంస్యాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
|