ప్రారంభమైన పివి ఎక్స్‌ప్రెస్ వే

Gulzar Ghouse|
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను సోమవారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రారంభించారు.

పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను సోమవారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రత్యేకమైన బస్సులో ఈ ఫ్లై ఓవర్‌పై ప్రయాణించారు.

ఆసియాలోనే అతి పెద్దదైన ఈ ఫ్లైఓవర్ పొడవు 11.633 కిలోమీటర్లు, ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని రూ.600 కోట్ల ఖర్చుతో నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ నగరం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళేందుకు వీలుగా ఈ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌పైకి ఇటు సరోజినిదేవి కంటి ఆసుపత్రి, అటు ఆరామ్‌ఘర్ చౌరస్తా నుంచి ఎక్కే వాహనాలు ఎడమవైపునుంచి మాత్రమే ప్రవేశించాల్సి ఉంటుందని పోలీసు అధికారులు సూచించారు.

ఇదిలావుండగా దీనిపై ప్రయాణించే వాహనాల వేగం కేవలం ప్రతి గంటకు అరవై కిలోమీటర్లకు మించకూడదు. కాగా ద్విచక్ర, త్రిచక్ర(ఆటోలు), వాహనాలతోపాటు నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు తదితర నెమ్మదిగా ప్రయాణించే వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం నిషిద్ధమని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.


దీనిపై మరింత చదవండి :