శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2019 (18:06 IST)

అన్ని రాజకీయ పక్షాలు కలసికట్టుగా పోరాడాలి: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లోని భవన నిర్మాణ కార్మికుల కోరిక మేరకు ఇసుక సమస్య పరిష్కారంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చొరవ తీసుకున్న జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ అన్ని పార్టీల అగ్ర నాయకులతో ఈ రోజు ఫోన్ లో మాట్లాడారు. 

 
తెలుగుదేశం అధ్యక్షుడు  నారా చంద్ర బాబు నాయుడుతో ఈ విషయమై మాట్లాడారు. తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె కోసం అక్కడి రాజకీయపక్షాలు ఎటువంటి స్ఫూర్తి చూపుతున్నాయో ఇసుక సమస్య పరిష్కారానికి, లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు మళ్ళీ ఉపాధి లభించేలా సమైక్యంగా అన్ని రాజకీయ పక్షాలు ముందుకు వెళ్లాలని  కోరారు.

నవంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ కి తెలుగుదేశం కుడా సంఘీభావం ప్రకటించాలని  చంద్ర బాబును కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా మాట్లాడారు. తొలుత ఇదే సమస్య పై బి.జె.పి., ఏ.పి. అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

ఇదే విషయమై ఆంధ్రప్రదేశ్ లోని  సి.పి.ఎం. కార్యదర్శి మధు, సి.పి.ఐ.కార్యదర్శి  రామకృష్ణ, లోక్ సత్తా అధ్యక్షులు డి.వి.వి.ఎస్.వర్మ, బి.ఎస్.పి. అధ్యక్షులు సంపత్ రావుతో కూడా  పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడారు.

లాంగ్ మార్చ్ లో తమ తమ కార్యకర్తలతో కలసి పాల్గొనవలసిందిగా కోరారు. విషయాన్ని తమ తమ పార్టీ లో చర్చిస్తామని వారు చెప్పారు. లాంగ్ మార్చ్ కు ఆహ్వానించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేసారు.