శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:23 IST)

ఎయిడెడ్ పాఠశాలలను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దు: హైకోర్టు

ఎయిడెడ్ పాఠశాలలను బలవంతంగా స్వాధీనం చేసుకోవద్దంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వెంటనే అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడం వలన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో విద్యా చట్టం నిబంధనలకు వ్యతిరేకమని దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడు కోర్టుకు హాజరయ్యారు. పాఠశాలలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, ఒక వేళ స్వాధీనం చేసుకోకపోతే ఆ స్కూల్స్‌కు ఎయిడ్ నిలిపివేస్తామని, పిటిషనర్లను బెదిరిస్తున్నారని.. పిటిషనర్ల తరఫు న్యాయవాది ముత్తుకు మల్లి శ్రీ విజయ్ న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చారు.

దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. తాము అటువంటి నిర్ణయం తీసుకోలేదని, బలవంతంగా పాఠశాలలు స్వాధీనం చేసుకుంటామని అనలేదని, ఎయిడ్ నిలిపివేస్తామని చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఆయన స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 4కు వాయిదా వేసింది.