తెలుగు జాతి ఉన్నంతవరకు బాలు జీవించే ఉంటారు : జస్టీస్ ఎన్వీ రమణ
సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు బాలు బతికే ఉంటారని వ్యాఖ్యానించారు. తన గాన మాధుర్యంతో యావత్ ప్రపంచాన్ని ఆనంద సాగరంలో ఓలలాడించిన గొప్ప వ్యక్తి ఎస్పీ బాలు అని కొనియాడారు.
ఆయన మరణం తెలుగు భాషకు, జాతికి తీరని లోటని అన్నారు. తన అమృతగానంతో తెలుగు భాష, సాహిత్య చరిత్రలను సజీవంగా ఉంచిన మహనీయుడని ప్రశంసించారు. తన అమరగానంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది సంగీత ప్రియుల హృదయాలను ఆయన కొల్లగొట్టారని, యావత్ సంగీత సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా ఏలిన జైత్ర యాత్రికుడని అన్నారు.
తెలుగు జాతి ఉన్నంత వరకు బాలు బతికే ఉంటారని, ఆయన మరణం తెలుగుతల్లికి గర్భశోకం మిగిల్చిందని, తెలుగు వారంతా ఆయన కుటుంబ సభ్యులేనని జస్టిస్ రమణ అన్నారు. బాలు కుటుంబ సభ్యులకు, సంగీత అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ఆయన విడుదల చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు.