శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (06:38 IST)

ఫిజియోథెరపీతో విశేష ప్రయోజనాలు: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మిస్తీ చక్రవర్తి

ఫిజియోథెరపీతో విశేష ఫలితాలు లభిస్తాయని ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మిస్తీ చక్రవర్తి తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా అను మై బేబీ హాస్పిటల్ నందు బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరోయిన్ మిస్తీ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక వైద్య చికిత్సల్లో ఫిజియోథెరపీకి విశిష్ట స్థానం ఉందని, రుగ్మతల బారినపడిన శరీర భాగాలను తిరిగి సక్రమంగా పనిచేయించేందుకు ఫిజియోథెరపీ సహాయపడుతుందని అన్నారు.

గర్భిణులు, నవజాత శిశువుల కోసం సకల సదుపాయాలతో అను మై బేబీ హాస్పిటల్ ను స్థాపించడం అభినందనీయమని అన్నారు. అను మై బేబీలో అందుబాటులో ఉన్న ఫిజియోథెరపీ, యోగా సేవలు గర్భిణులకు ఎంతో ఉపయుక్తంగా వుంటాయని మిస్తీ చక్రవర్తి పేర్కొన్నారు.

అనంతరం అను హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి.రమేష్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీదేవి మాట్లాడుతూ 1951 సెప్టెంబర్ 8న ఫిజియోథెరపీ అనే అద్భుత చికిత్సా విధానం ఆవిష్కరింపబడిందని, ప్రతియేటా సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంగా జరుపుకునేందుకు 1996లో నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

'కోవిడ్-19తో దీర్ఘకాలంగా బాధపడుతున్న రోగులకు ఫిజియోథెరపీ'' అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఈ ఏడాది 'వరల్డ్ ఫిజియోథెరపీ డే'ను జరుపుకుంటున్నామని తెలిపారు. అను మై బేబీ హాస్పిటల్ నందు నిష్ణాతులైన ఫిజియోథెరపిస్టులు, అనుభవజ్ఞులైన యోగా శిక్షకుల సహకారంతో గర్భిణులకు ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని, గర్భిణుల సురక్షిత ప్రసవానికి ఫిజియోథెరపీ, యోగాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

ఫిజియోథెరపీ, యోగాల ద్వారా ప్రసవానంతరం మహిళలు త్వరగా సాధారణ స్థితికి చేరుకోగలుగుతారని వివరించారు. అను మై బేబీలోని ప్రత్యేక విభాగం ద్వారా అత్యాధునిక ఫిజియోథెరపీ చికిత్సలు, సంప్రదాయ యోగా శిక్షణలను అందిస్తున్నామని డాక్టర్ జి.రమేష్, డాక్టర్ శ్రీదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అను మై బేబీ వైద్యులు డాక్టర్ కవిత, డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ సుకీర్తి, డాక్టర్ పావని, డాక్టర్ సురభి పాల్గొన్నారు.