స్వాతంత్ర్యోద్యమంలో "తెలుగుదనం"

Independence Day
Ganesh|
WD
సహజంగానే స్వాతంత్ర్యకాముకులైన తెలుగు ప్రజానీకం.. భారత స్వాతంత్ర్య సమరంలో ముందుకు ఉరకడం కూడా అత్యంత సహజం.

అందుకే 1919వ సంవత్సరంలో కాంగ్రెస్ నాయకత్వం వహించిన తరువాత తెలుగునాట స్పందన మరింత ఎక్కువయ్యింది. ఈ స్పందనకు 1913 నుంచి జాతీయ భావాలు గల పత్రికలెన్నో ఉద్యమానికి అపారంగా దోహదం చేశాయి.

స్వాతంత్ర్య సరిసిద్ధికి, సంఘానికి, సంస్కృతి విస్తరణకు ఆ పత్రికలు చేసిన సేవ అపారం. స్వాతంత్ర్యోద్యమంలోని ప్రతిఘట్టంలోనూ తమ కంఠాన్ని, కలాన్ని ఝళిపించిన ఆ పత్రికల సేవలు అజరామరం.

కోట్లాది ప్రజలను ప్రోత్సహించి సమరాయత్తులను చేస్తూ, ఈ సేవాయజ్ఞంలో నిషేదాజ్ఞలకు గురయినా, కొన్ని సంవత్సరాలు కొనప్రాణంతో కొట్టుమిట్టాడినా.. మళ్లీ మళ్లీ పుంజుకుని అవి విజృంభించాయి.

రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్ర్యోద్యమ పోరాటానికి జడిసిన బ్రిటీషు ప్రభుత్వం.. దేశాన్ని రెండు ముక్కలుగా చేసి, లేదా... చాలా ముక్కలుగా చేసి, దేశానికి విముక్తి ప్రసాదిస్తామంటూ ముందుకు వచ్చింది.

ఆ క్రమంలో 1946లో నెహ్రూ ప్రధానిగా తాత్కాలిక మంత్రివర్గం ఏర్పడింది. ఆ తరువాత 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రా భారతావని బ్రిటీష్ దాస్యశృంఖలాలను పూర్తిగా తెంచుకుని విముక్తమయ్యింది.

ఈ క్రమంలో 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రదానానికి ముహూర్తం నిర్ణయించటంతో... అప్పట్లో ప్రజల నోళ్లలో నానిన పత్రికయిన "ఆంధ్రప్రభ".. ఆగస్టు 6వ తేదీ నుంచి 14వ తేదీదాకా ఎనిమిది సంపాదకీయాలను రాసింది.

వాటిలో నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖలూ, ప్రభుత్యోద్యోగులూ.. ఎంత ఉదాత్తతతో ప్రవర్తించాలో, ఎంత నిస్వార్థపూరితంగా వ్యవహరించాలో, ఎంత నిబ్బరంగా మెలగాలో తన కలంతో రంగరించి రాసింది.

ఆంధ్రప్రభ ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర సమరాన్ని వివరిస్తూ... స్వాతంత్య్ర సిద్ధికై సకల త్యాగాలూ చేసిన మహనీయులను స్మరిస్తూ... నాయకులు, ప్రజలు ఇకమీద నిర్వహించవలసిన కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ "స్వాతంత్య్ర భానూదయం'' అనే శీర్షికతో
వచ్చిన ఆ సంపాదకీయాలలోని కొన్ని వాక్యాలు వెబ్‌దునియా పాఠకుల కోసం...

"దాస్యాంధకారం తొలగింది. స్వాతంత్య్ర భానూదయం జరిగింది. పారతంత్ర్య శృంఖలాలు ఘళ్లుమని తెగిపోయినవి, తిరిగి స్వతంత్ర ప్రజలమయినాము. ఘోరజాతీయ కళంకం తొలగింది.

ఇక మెరిసేది దివ్యప్రభలతో వెలుగొందవచ్చు. పంజరం తలుపు తెరుచుకున్నది. ఇక దివ్యాంబర పథాలలోకి ఎగిరిపోయి, స్వేచ్ఛావిహారం చేయకపోతే తప్పు మనదే."

"ఎంత శుభదినమిది..! ఎంత సంతోష దినమిది..! ఎంత పుణ్య దినమిది..! ఎంత పర్వదినమిది..! ఎంతటి చరిత్రాత్మక దినమిది..!".. అంటూ స్వతంత్ర్య భారతావని విముక్తమయిన సందర్భంగా తెలుగువాణిని వినిపిస్తూ... తన కలంతో తెలుగుజాతి మొత్తాన్ని చైతన్యవంతం చేసి, ఆలోచింపజేసిన ఆనాటి తెలుగు వార్తా పత్రికలకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరం జేజేలు చెబుదాం..!!


దీనిపై మరింత చదవండి :